కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న ‘బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు’ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు సీఎం సిద్ధరామయ్య హాజరైన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఉద్ధృతంగా సాగుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం మరింత పెరిగింది.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకున్న వేడుకల తర్వాతనే సీఎం పదవి పంచాయితీ మళ్లీ తెరమీదకు వచ్చింది. మిగతా రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో డీకే శివకుమార్ వర్గమే కాకుండా కొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీ హైకమాండ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.
దీంతో సిద్ధరామయ్య–డీకే శివకుమార్ వర్గాల మధ్య అంతర్గత అసంతృప్తి, పవర్ షేరింగ్ రగడ గత కొన్ని రోజులుగా పార్టీని ఇబ్బంది పెడుతోంది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో, స్వయంగా సీఎం సిద్ధరామయ్య గత శనివారం డీకే శివకుమార్‌ను బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ కోసం ఆహ్వానించారు.
వారిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నప్పటికీ, ఇది కేవలం కౌర్ట్సీ మీటింగ్ అని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. “మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇవన్నీ మీడియా సృష్టించిన ఊహాగానాలు మాత్రమే,” అని సీఎం స్పష్టీకరించారు. అయితే పార్టీ అంతర్గతంగా నెలకొన్న పవర్ షేరింగ్ వివాదం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో తెలుస్తోంది.
Also Read:ఓట్ల కోసం సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన

