కరోనా దెబ్బకు అల్లకల్లోలం అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. గురువారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 49,058 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 24 ఉదయం 6 గంటల వరకూ పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప శుక్రవారం ప్రకటించారు.
కరోనా కర్ఫ్యూ పెట్టిన పెద్దగా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక హోటళ్లు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు మాత్రం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ తెరిచి ఉంటాయని చెప్పారు. వలస కార్మికులు ఎవరు రాష్ట్రం విడిచి వెళ్లవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితుల మరణాల నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.