గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌..

67

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. లైబ్రరీ భవనంలో కోవిడ్ రోగుల కోసం 160 అదనపు పడకలతో సిద్ధం చేసిన కొత్త వార్డును ఆయన పరిశీలించారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి లో అందిస్తున్న చికిత్స సదుపాయాలను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైద్యులను ఆయన అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.

రోజుకు 4 మెట్రిక్ టన్నుల సామర్ద్యంతో నెలకొల్పి, నేటి నుండి పనిచేస్తున్న కొత్త ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను ప్రధాన కార్యదర్శి తనిఖీ చేశారు. ఈ కొత్త ఆక్సిజన్ ప్లాంట్ 400 మంది పేషంట్లకు సరిపడ ఆక్సిజన్‌ను అందిస్తుంది. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు Cleanliness drive కింద చేపట్టిన పారిశుధ్యం, వీధి దీపాలు, ఆక్సిజన్ పైప్లైన్ పనులను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.

సీఎస్‌ వెంట వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.