క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి అకాడ‌మీకి కృషి- టీస్పోర్ట్స్ చైర్మన్

147
jaganmohan rao

దేశానికి తొలి ఒలింపిక్ ప‌త‌కం అందించిన తెలుగు మ‌హిళా క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రిచే హైద‌రాబాద్‌లో వెయిట్ లిఫ్టింగ్ అకాడ‌మీ ఏర్పాటుకు కృషి చేస్తామ‌ని జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఉపాధ్య‌క్షుడు, టీస్పోర్ట్స్ చైర్మన్ అరిస‌న‌ప‌ల్లి జ‌గ‌న్మోహ‌న్ రావు చెప్పారు. 2000లో సిడ్నీ ఒలింపిక్స్ మ‌హిళ‌ల వెయిట్ లిఫ్టింగ్ 64 కిలోల విభాగంలో మ‌ల్లీశ్వ‌రి కాంస్య ప‌త‌కం సాధించి ఇర‌వై ఏళ్లు కావ‌స్తున్న సంద‌ర్భంగా టీస్పోర్ట్స్ ఆమెతో వెబ్‌నైర్ నిర్వ‌హించింది. ఇందులో శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సాయిలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్ర‌తిభ గ‌ల యువ వెయిట్ లిఫ్ట‌ర్లు అనేక మంది ఉన్నార‌ని తెలిపారు. అయితే, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్టుగా శిక్ష‌ణ ఇచ్చే అకాడ‌మీ లేక వారి స‌త్తా వెలుగులోకి రావ‌డం లేద‌ని చెప్పారు. హైద‌రాబాద్ కేంద్రంగా తెలంగాణ‌లోని యువ లిఫ్ట‌ర్ల‌ను సాన పెట్టేందుకు మ‌ల్లీశ్వ‌రి ఫౌండేష‌న్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ తెలిపారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన మ‌ల్లీశ్వ‌రి ప్ర‌భుత్వ స‌హ‌కార‌మందిస్తే తెలంగాణ రాష్ట్రానికి త‌ప్ప‌కుండా త‌న సేవ‌లందిస్తానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారుల అభ్యున్న‌తి కోసం ప‌నిచేయ‌డానికి తాను ఎల్ల‌ప్పుడు సిద్ధంగా ఉంటాన‌ని ఆమె చెప్పారు. దీనికి శాట్స్ చైర్మ‌న్ స్పందిస్తూ మ‌ల్లీశ్వ‌రి త్వ‌ర‌లో హైద‌రాబాద్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌హ‌కారంతో సీఎం కేసిఆర్‌ను క‌లిసి రాష్ట్రంలో వెయిట్ లిఫ్టింగ్ అభివృద్ధిపై స‌మావేశ‌మ‌వుదామ‌ని అన్నారు.