సంక్రాంతి సంబరాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆపాయ్యత, అనురాగాలు,సొగసులతో పల్లెలు, పట్టణాలు పులకరిస్తున్నాయి. బోగి, సంక్రాంతి కంటే కనుమను రైతన్నలు వైవిధ్యంగా జరుపుకుంటారు. పల్లె జీవన విదానాన్ని పశువులతో పంటలతో వారికి గల అనుబందానికి కనుమ పండుగ అద్ధం పడుతుంది.
ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు, కొత్త అల్లుళ్లు.. ఆడపడుచుల కోలాహలంతో సంక్రాంతి పండుగ రోజున పల్లె సందడిగా ఉంటుంది. బందువలు ఆపాయ్యత, పలకరింపుతో పులకరించిపోతారు. పిండి వంటలు, సాంప్రదాయ క్రీడలతో
పంటలు ఇంటికి వచ్చినందుకు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే పండుగే సంక్రాంతి. మూడు రోజుల్లో మూడో రోజున పశువులకు కృతజ్ఞతగా కనుమ పండుగగా జరుపుకుంటారు. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చే సందర్భంగా జరుపుకునే వేడుక. పంటల కోసం ఆరుగాలం శ్రమించే రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి పశువులే. అందుకే మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఒక రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. అదే కనుమ పండుగ. మరి పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి రైతులు ప్రత్యేకంగా అలంకరిస్తారు. రైతులు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో కనుమ రోజున ఎటువంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో పూజిస్తారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు.పశువులను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వేడుక చేస్తారు. ప్రత్యేకంగా చేసిన పిండివంటలను వాటికి నైవేద్యంగా పెడతారు.
తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు… భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి… పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని… మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ… ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో కనుమ మరుసటి రోజును ముక్కనుమ అంటారు. ఈ కనుమ పండుగ మీ ఇంటిలో సంతోషాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ టీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు.