రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్‌లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్, క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న కంగనా.. క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం టైటిల్‌లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల వారణాసిలో జరిగింది. ఈ సందర్భంగా కంగనా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తాను 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశానని, ఏదైనా సాధించినట్లు ఎప్పటికి ఫీలవుతానో అప్పటికి ఏమీ తెలియదని, ఇన్నాళ్లకు తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని చెప్పింది. విజయాలు, పరాజయాలు అన్నీ చూసి తాను అన్నీ సాధించేశానని అనుకోడానికి ముందే దర్శకత్వం వైపు కూడా వెళ్తున్నట్లు వివరించింది. ఇక నటనతో సమయం ఎక్కువగా వేస్ట్ చేసుకోనని, అయితే దర్శకత్వం వహిస్తూనే తన సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. అందుకే క్రిష్‌తో ‘నా చిట్టచివరి డైరెక్టర్ మీరే’ అని చెప్పేశానంది. తనకు నటిగా కంటే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టమంది.
ఇదేమీ యాక్షన్ చిత్రం కాదని కానీ పోరాట సన్నివేశాలు ఈ కథలో కీలకమైన పాత్ర పోషిస్తాయని తెలిపింది. గుర్రపుస్వారీ అనేది ఈ చిత్రంలో నా పాత్రకు చాలా కీలకం. ఈ విషయాన్ని క్రిష్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే గుర్రపు స్వారీకి సంబంధించి పరిశోధన కూడా చేశారాయన. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రపు స్వారీలో నిష్ణాతురాలు. ప్రపంచంలోనే గొప్పగా గుర్రపు స్వారీ చేసే వాళ్లలో ఒకరామె’’
నాదీ లక్ష్మీబాయి లాంటి తిరుగుబాటు మనస్తత్వమని చాలామంది అన్నారు. ఆ విషయాన్నీ నేనూ అంగీకరిస్తాను. ఓ లక్ష్యం కోసం తిరుగుబాటు చేసిన వనిత ఆమె. అదే ఆమెను హీరోను చేసింది. పరిస్థితుల్ని బట్టి నేనూ అప్పుడప్పుడు తిరుగుబాటు స్వరం వినిపిస్తుంటాను’’
త్వరలోనే నేను మెగాఫోన్ పట్టుకోబోతున్నాను. ‘మణికర్ణిక’ తర్వాత ఆ చిత్రం ఉంటుంది. అది పూర్తిస్థాయి హాస్య చిత్రమని చెప్పింది. నా బయోపిక్ తీస్తే టైటిల్ ఏం పెట్టాలి అని కొంతమంది అడిగారు. అసలు నా లక్ష్యానికి ఇంకా చేరుకోకుండానే బయోపిక్ అంటే ఎలా? ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ఫిల్మ్‌మేకింగ్‌లోకి ఇంకా అడుగుపెట్టలేదు. వ్యక్తిగతంగా నటిగా కంటే ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే నాకు ఇష్టమని ఈ బ్యూటీ సెలవిచ్చింది.