జల్లికట్టు నిషేదానికి వ్యతిరేకంగా మేరినా బీచ్‌లో చేపట్టిన నిరసన..హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ.హింసాత్మక ఘటనలోని ఓ వీడియో అందరిని విస్మయానికి గురి చేసేలా ఉంది. ఆందోళనలో భాగంగా ఓ పోలీసు ఆటోకు నిప్పంటిస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను సినీ నటుడు కమలహాసన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘ఏంటిది. ఎవరైనా వివరించగలరా’ అంటూ కమలహాసన్ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కమల్ మంగళవారం మాట్లాడుతూ..మెరీనా బీచ్ లో సోమవారం జరిగిన ఘటనలు బాధించాయని చెప్పారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా పోలీసులు దౌర్జన్యం చేశారని వాపోయారు. పోలీసులే విధ్వంసానికి పాల్పడడం శోచనీయమని, వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులని వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. మూగజీవాల హక్కులపై తనకు అవగాహన లేదన్నారు. ఎద్దులు కూడా పెంపుడు జంతువులేనని అన్నారు. జల్లికట్టుతో పోల్చుకుంటే ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. జల్లికట్టుపై సీఎం పన్నీరు సెల్వం వ్యవహరించిన తీరు బాగుందని కమల్ ప్రశంసించారు. ఇది జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటం కాదని సంస్కృతి పరిరక్షణకు జరుగుతున్న ప్రజా ఉద్యమం అని వివరించారు.
What is this. Please explain some one pic.twitter.com/MMpFXHSOVk
— Kamal Haasan (@ikamalhaasan) January 23, 2017
మనుషులు మధ్య అడ్డుగోడలు అవసరం లేదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ‘సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నాం. వీటిని కూలగొట్టాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్ ను ద్వేషించను. ఒకవేళ నేను 1924లో పుట్టివుంటే మహాత్మ గాంధీ ముందు కూర్చుని భారత్, పాకిస్థాన్ కలిసికట్టుగా ఉండాలని అడిగేవాడిని. దేనిపైనా నిషేధం విధించడం సరికాదు. నియంత్రణ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు. తమిళనాడు శాసనసభ అత్యవసరంగా సమావేశమై ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తగ్గాయి.