తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎం అధినేత కమలహాసన్ డీఎంకే నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి తాను బీ-టీమ్ అని, మోదీ, అమిత్ షాల సలహాలను తీనుకుంటున్నానని డీఎంకే నేతలు ఆరోపించడంపై కమలహాసన్ మండిపడ్డారు. తాను ఏ పార్టీకి బీ-టీమ్ ను కాదని ఆయన అన్నారు. తన వల్ల డీఎంకే నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వారు చేస్తున్న వ్యాఖ్యలే దానికి నిదర్శనమని చెప్పారు.
ఎన్నికల్లో తమ ప్రత్యర్థి డీఎంకేనని అన్నారు. అన్నాడీఎంకే తనను తాను నాశనం చేసుకుంటోందని చెప్పారు. బిగ్ బాస్ షో, సినిమాల ద్వారా వస్తున్న డబ్బును పార్టీ ఫండ్ కు జమ చేస్తున్నానని తెలిపారు. ఎన్నికలలో ఓడిపోయినా తాను బాధపడనని అన్నారు. ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని చెప్పారు.