దేవా మృతి..కన్నీటి నివాళి

1
- Advertisement -

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు తేనిసై తెంద్రల్‌.. దేవా (75) మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దేవా భౌతికకాయానికి కన్నీటి పర్యంతమవుతూ నివాళులర్పించారు. మరోవైపు, నటుడు కమల్‌ హాసన్‌ తనకు ప్రియమైన సోదరుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

దేవా మరణంతో తమిళ సినీ సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన శకం ముగిసినట్లయింది. గానా పాటలను ప్రధాన స్రవంతి సినిమాల్లోకి తీసుకొచ్చి, తనదైన సంగీత శైలితో ప్రేక్షకులను అలరించిన ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సంగీత దర్శకుడిగా కొనసాగారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

రజనీకాంత్‌ సినిమాలకు దేవా అందించిన సంగీతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ ఎంట్రీ సన్నివేశాలకు ఆయన అందించిన నేపథ్య సంగీతం అభిమానుల్లో విశేష ఆదరణ పొందింది. దేవా భౌతికకాయాన్ని సందర్శించిన రజనీకాంత్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది.

Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్

నటుడు కమల్‌ హాసన్‌ కూడా దేవా మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా పంచతంత్రం సినిమా సమయంలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. దేవా సంగీత ప్రతిభను, ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.

- Advertisement -