అభిజిత్‌కు కండిషనల్ బెయిల్‌

2
- Advertisement -

సీజేపీ (కాక్‌రాచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ ఇచ్చే పీస్‌ బాండ్‌పై సంతకం చేసిన తర్వాత ఆయనను విడుదల చేయనున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బెయిల్‌ కోసం రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది.

శుక్రవారం ఢిల్లీలోని జండేవాలన్‌ ప్రాంతంలో తన నివాసం నుంచి బయటకు వచ్చి, కనాట్‌ ప్లేస్‌లో నిర్వహించ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్‌ 10న ఆయన సమర్పించిన శాంతిభద్రతల బాండ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణతో శనివారం ఉదయం మరో కేసులో అరెస్టు చేశారు.

దీప్కే అరెస్టు చట్టబద్ధతను సవాలు చేస్తూ సీజేపీ న్యాయ వ్యవహారాల విభాగం అధిపతి రత్నా సింగ్‌ శనివారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్ఈఎం) కోర్టును ఆశ్రయించారు. దీప్కే ప్రాథమిక హక్కులు, చట్టపరమైన ప్రక్రియను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు శనివారం ముందుగా విడుదల చేశారు. అక్టోబర్‌ 10న ఢిల్లీ విమానాశ్రయంలో విమానం నుంచి దీప్కేను అదుపులోకి తీసుకున్న సమయంలోనూ ఆయనపై శాంతిభద్రతల ఉల్లంఘనకు సంబంధించిన కేసు నమోదైంది. ఆ సందర్భంలో ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని ఆయనతో బాండ్‌పై సంతకం చేయించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -