పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు

2
- Advertisement -

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. CMRL–Exalogic ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అక్టోబర్ 23న కొచ్చిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని సూచించింది.

ఈడీ అధికారులు అక్టోబర్ 16న సమన్లు జారీ చేయగా, శనివారం తిరువనంతపురంలోని విజయన్ నివాసానికి వాటిని అందజేసినట్లు సమాచారం. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం సంబంధిత పత్రాలు, రికార్డులు సమర్పించడంతో పాటు, తన వాంగ్మూలాన్ని నమోదు చేయించుకోవాలని ఈడీ కోరినట్లు అధికారులు తెలిపారు.

కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) నుంచి పినరయి విజయన్ కుమార్తె వీణా టి నిర్వహించిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు అక్రమంగా డబ్బు చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఐటీ కన్సల్టెన్సీ, మార్కెటింగ్ సేవల పేరుతో సుమారు రూ.2.78 కోట్ల చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ చెల్లింపుల వెనుక అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఈ వ్యవహారంలో విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణా, అల్లుడు, మాజీ మంత్రి పి.ఏ. మహమ్మద్ రియాస్ పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కేరళ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పినరయి విజయన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, అక్టోబర్ 16న ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దసరా సెలవుల సమయంలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని, లేదంటే అక్టోబర్ 26న కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత విచారణ చేపట్టవచ్చని తెలిపింది.

Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్

ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న ఈడీ విచారణకు విజయన్ హాజరవుతారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -