టీఎంసీ ఎంపీల మధ్య వార్!

6
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నాయకురాలు, ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ తన సొంత పార్టీకే చెందిన ఎంపీ కల్యాణ్ బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభలో తనను దుర్భాషలాడారని పేర్కొంటూ ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ విషయంలో కల్యాణ్ బెనర్జీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజే (గురువారం) కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపిన లేఖలో.. కల్యాణ్ బెనర్జీ సభలోని మహిళా సభ్యులను పదే పదే దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు.

లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభ లోపల నన్ను పదే పదే దుర్భాషలాడారు. దీనిపై న్యాయం కోరుతూ ఆయనపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని తన లేఖలో పేర్కొన్నారు. నాలుగు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన దస్తీదార్ తన లేఖలో ఈ విధమైన మహిళా ద్వేషపూరిత ప్రవర్తన చాలా మంది మహిళా సభ్యుల పట్ల జరిగింది, దీనిని కచ్చితంగా శిక్షించాల్సిందే అని స్పష్టం చేశారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా ఉన్న కల్యాణ్ బెనర్జీ స్థానంలో దస్తీదార్‌ను నియమించారు. కాగా బుధవారం కల్యాణిలో ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన పరిపాలనా సమీక్షా సమావేశానికి హాజరుకావద్దని టీఎంసీ నాయకత్వం ఆదేశించినప్పటికీ దస్తీదార్ ఆ నిబంధనను పక్కనబెట్టి మరీ సమావేశంలో పాల్గొన్నారు. అంతేగాదు ఇది ఏ పార్టీ కార్యక్రమం కాదు. ఇది కేవలం పరిపాలనా పరమైన కార్యక్రమం, పరిపాలన అనేది అందరి కోసం ఉంటుంది అని ఆమె సమర్థించుకున్నారు.

ఈ పరిణామాలపై బీజేపీ నేతలు స్పందిస్తూ ఇది పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత విషయమని పేర్కొంది. టీఎంసీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి తమకు ఎలాంటి ఆసక్తి లేదని కాషాయ పార్టీ స్పష్టం చేసింది.

- Advertisement -