కాక‌తీయ వైభ‌వ సప్తాహం..బ్రోచ‌ర్ రిలీజ్

75
ktr
- Advertisement -

కాకతీయుల చరిత్రను చాటి చెప్పేలా ఈ నెల 7 నుండి 13 వరకు కాకతీయ వైభవ సప్తాహంను ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గార్లతో కలసి కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాల బ్రోచర్ ను విడుదల చేశారు.

కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లు, షెడ్యూల్‌, తదితర అంశాలపై హైదరాబాద్ లోని అయన కార్యాలయంలో పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ , భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనే అంశం ప్రధానమైనదని ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కాకతీయ పాలనా విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయుల గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారని తెలిపారు. కాకతీయులు ప్రజల కొరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యతని అన్నారు. కాకతీయ పాలనా వైభవం, చారిత్రిక విశిష్టత తెలిపేలా కాకతీయ వైభవ సప్తాహంను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.

వేడుకలకు అవసరమైన ఆర్ధిక వనరులను ప్రభుత్వం సమాకురుస్తుందన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల నుండి అవసరమైన పనులు ఆయా శాఖల పరిధిలో చేపడతామన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామి చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో, అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని, జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి సమన్వయం చేయాల్సిందిగా ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ కు సూచించారు. వరంగల్ నగర ప్రధాన కూడల్లన్నింటిలో మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేయాలనీ, నిపుణుల చేత కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం పై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలన్నారు. వందేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుందని కాబట్టి కాకతీయ చరిత్రను భావితరాలకు అందించేలా భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాకారులను, కవులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవులు కళాకారులను ఈ సందర్భంగా సన్మానించే విధంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలకు విస్కృత ప్రచారం కల్పించేలా వరంగల్ నగరం అంతటా హోర్డింగులని ఏర్పాటు చేయాలని , డిజిటల్ మీడియాను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. కాకతీయ శిల్పకళా వైభవాన్ని తెలిపేలా కాఫీ టేబుల్ పుస్తకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -