చైనాలోని నాన్జింగ్ ప్రాంతంలో 88 మీటర్లు(289 అడుగుల) ఎత్తైన బుద్దుని కాంస్య విగ్రహాన్ని గురువారం అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్ సందర్శించారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక కేంద్రంగా దానిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అత్యంత ఎత్తైన విగ్రహం, స్మృతివనం ఏర్పాటు కోసం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని వేశారు. ప్రస్తుతం కమిటీ సభ్యులు అత్యంత ఎత్తైన విగ్రహాలు తయారుచేయడంలో ప్రసిద్దిపొందిన చైనా దేశంలో పర్యటిస్తున్నారు. నాన్జింగ్ లోని వుక్సి పట్టణంలోగల ఈ బుద్ధుని విగ్రహ రూపకల్పన, దాని నిర్వహణ, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు ఏర్పాటు చేసిన వసతులను కమిటీ పరిశీలించింది. ప్రస్తుతం ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుకెక్కింది. 74 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చారు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట వద్ద కూడా దాదాపు 32 ఎకరాల్లో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత ఎత్తున్నఈ బుద్ధుని విగ్రహాన్ని పరిశీలించి, దాని వివరాలను అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్ లు తెలుసుకున్నారు.