రివ్యూ : ఘాజీ

275
Ghazi :Review
- Advertisement -

యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీసేయడమంటూ సబ్‌ మెరైన్‌ కథతో వచ్చాడు రానా. 1971 కాలంలో విశాఖపట్టణ తీరంలో భారతీయ నేవీకి, పాకిస్థాన్ నేవీకి మధ్య జరిగిన, ఎవరికీ తెలియని జలాంతర్గామి యుద్దం నేపథ్యంగా ఈ మూవీ తెరకెక్కింది. భారతీయ సినిమాల్లో వార్ డ్రామాలు చాలా తక్కువ. ముఖ్యంగా స్వతంత్ర పోరాట నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కినా.. పూర్తి స్థాయి వార్ డ్రామాగా సినిమాలు రాలేదు. ఆ లోటును తీరుస్తూ.. చరిత్ర కథల్లో పెద్దగా ప్రాచుర్యం పొందని ఓ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి.  ట్రైలర్‌, ఫస్ట్ లుక్‌, ప్రమోషన్స్‌తో ఆకట్టుకున్న ఘాజీ ఎలా ఉందో చూద్దాం

Review : Ghazi

కథ :

పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో ఉన్న తన సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి’ అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు. కానీ శత్రువుల పన్నాగాన్ని ముందే పసిగట్టిన నేవీ అధికారులు ఎస్‌ 21ను ఘాజీని ఎదుర్కునేందుకు పంపిస్తారు. పిఎన్ఎస్ ఘాజీ అత్యంత శక్తివంతమైన సబ్ మెరైన్, భారత జలాంతర్గాముల కన్నా ఎన్నో రెట్లు వేగంగా శక్తివంతంగా పనిచేసే సబ్ మెరైన్. ఇంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనటానికి రణ్ విజయ్ సింగ్ , అర్జున్ వర్మలు ఏం చేశారు. ఆ రెండు జలాంతర్గాముల మధ్య యుద్ధం ఎలా సాగింది ? వరికి ఎవరు గెలిచారు ? అన్నదే ఘాజీ కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, దర్శకుడు, నటీనటులు. ప్రతీ నటుడు నిజంగా దేశం కోసం యుద్ధం చేస్తున్నామన్నంత ఆవేశంగా తెర మీద కనిపించారు. చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని మన విజయగాథను సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేసిన ఘాజీ టీం ఘన విజయం సాధించింది. ఒక్క సబ్ మెరైన్లో సాగే కథతో ఇంత భారీ చిత్రాన్ని తెరకెక్కించటం అంటే సాహసమే. కానీ ఎక్కడా పట్టు సడలకుండా సినిమాను నడిపించి సంకల్ప్ రెడ్డి ప్రేక్షకులను మెప్పించాడు.  ఫస్టాఫ్‌లో ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్స్ గా ఉన్న కేకే మీనన్, రానా ల మధ్య తలెత్తే అభిప్రాయం బేధాలను ఆసక్తికరంగా చూపారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లలో ఇండియన్ నేవీ పని తీరును, వేసిన యుద్ధ ప్రణాళికలను చాలా గొప్పగా చూపించారు. కీలకమైన పాత్రల్లో నటించిన రానా, కే కే మీనన్, అతుల్ కులకర్ణి, సత్యదేవ్ లు నటన సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది.

Review : Ghazi

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నిరుత్సాహంగా సాగుతాయి. సినిమాని పైకి లేపే కొన్ని కీలక సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది.ఇక తాప్సి పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు, కేవలం కొన్ని అంశాల కోసమే ఆ పాత్రను సృష్టించారు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. సబ్‌ మెరైన్‌, వాటి అంతర్భాగాలను నిర్మించిన తీరు చాలా బాగుంది.  సామాన్య ప్రేక్షకులకు సైతం అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కృష్ణ కుమార్ నైపథ్య సంగీతం బాగానే ఉన్నా ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ బాగుంది. పివిపి, పివి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఘాజీ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని మన విజయగాథను సినిమాటిక్ గా తెరకెక్కించడం గొప్పవిషయం. కథ, కథనం, ఆకట్టుకునే యుద్ద సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్లస్ కాగా కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ మిస్సవడం మైనస్ పాయింట్. మొత్తంగా తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వించదగ్గ చిత్రం ఘాజీ.

విడుదల తేదీ : 17/02/ 2017
రేటింగ్ : 3.5/5
నటీనటులు :రానా, తాప్సి
సంగీతం :కృష్ణ కుమార్
నిర్మాతలు :పివిపి, మాటినీ ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం :సంకల్ప్ రెడ్డి

- Advertisement -