పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తే.. కాంగ్రెస్ ఉండదు- కడియం

216
- Advertisement -

పాక్షిక మేనిఫెస్టోను చూసే ప్రతిపక్ష నేతలు బెంబేలెత్తిపోతున్నారని.. ఇక పూర్తిస్థాయి మేనిఫెస్టోను ప్రకటిస్తే
వారి పరిస్థితి ఎంటో..? అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక
మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన
హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ప్రకటించలేదని.. అలాంటిది తాము ఎలా కాపీ కొడతామన్నారు. కాంగ్రెస్ నేతలు
దివాళా కోరు మాటలు మాని.. ప్రజలు మెచ్చుకునే మేనిఫెస్టోను ప్రకటించాలని సూచించారు.

నిరుద్యోగ భృతి ద్వారా తెలంగాణ యువతకు భరోసా లభించిందని.. ఎస్సీ, ఎస్టీలకు, కులవృత్తులకు
చేయూతనిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో దేవాదుల, కాళేశ్వరం, పాలమూరు, సీతారామా ప్రాజెక్టులను
పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కడియం తెలిపారు. కాంగ్రెస్‌కు
అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదని.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు ఆశీర్వదించాలని
కడియం కోరారు.

ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కడియం కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ
మారేదిలేదని..తాను టీఆర్ఎస్‌ను వీడేది లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ
నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. దివాళాకోరు రాజకీయాలకు ఇది నిదర్శనమని కడియం ద్వజమెత్తారు.

- Advertisement -