సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పేరును కేంద్రానికి సిఫారసు చేశారు ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి. నవంబర్ 24 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ సూర్య కాంత్.
ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతుంది — దాదాపు 14 నెలల పాటు. జస్టిస్ సూర్య కాంత్. లా మంత్రిత్వ శాఖ ఆమోదం ఇచ్చిన తర్వాత, న్యాయమూర్తి సూర్యకాంత్ దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. గవాయి పదవీకాలం నవంబర్ 23న ముగుస్తుంది.
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. సూర్యకాంత్ సీజేఐగా నియమితులైతే, ఆ పదవిని చేపట్టిన తొలి హర్యానవిగా నిలుస్తారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన సూర్యకాంత్, న్యాయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి ఒక ఉపాధ్యాయుడు. సూర్యకాంత్ గ్రామ పాఠశాలలోనే ప్రాథమిక విద్య పూర్తిచేసి, 1984లో మహర్షి దయానంద విశ్వవిద్యాలయం (ఎండీయూ) నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.
తరువాత హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించి, తరువాత చండీగఢ్‌కు వెళ్లి పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు.38 ఏళ్ల వయస్సులో ఆయన హర్యానా రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004లో ఆయన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటికీ ఆయన చదువుపై ఆసక్తి కొనసాగించడంతో, 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పూర్తి చేశారు.
Also Read:యాక్షన్ సీన్స్‌లో #గోపీచంద్33
2018 అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన కీలక తీర్పుల్లో 2023లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను (ఆర్టికల్ 370) రద్దు చేయడాన్ని సమర్థించిన రాజ్యాంగ బెంచ్ తీర్పు ఒకటి. ఆ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే, 2022లో దేశద్రోహ చట్టం (సెడిషన్ లా) వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల బెంచ్‌లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు.

