2024లో నిర్వహించిన జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సీఐడీ (CID) విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాల్లో ప్రధాన నిందితుడు అభయ్ తివారీని విచారించిన అనంతరం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అభ్యర్థులకు పేపర్లు ఎలా సరఫరా చేశారనే వివరాలను అధికారులు సేకరించారు.
దాదాపు 15 మంది అభ్యర్థుల నుంచి తలా రూ. 12 లక్షల చొప్పున మొత్తం రూ. 1.80 కోట్లు వసూలు చేశారు.అభయ్ తివారీ అలియాస్ మనోజ్ కుమార్ తివారీ దాదాపు 45 మంది అభ్యర్థులను బొకారోలోని ఒక ఇంటికి తీసుకెళ్లి, దాదాపు 65 ప్రశ్నలు, వాటి సమాధానాలను బట్టీ పట్టించినట్లు ఒప్పుకున్నాడు. క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసే కాంట్రాక్టును ‘వెబెల్’ (Webel) కంపెనీకి ఇచ్చారని తివారీ తెలిపాడు. నిందితుడైన అభయ్ తివారీ స్వయంగా JSSC-CGL పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించగా, అతని సోదరుడు అక్షయ్ తివారీ, భార్య సుష్మా కుమారి కూడా ఈ పరీక్షలో ఎంపికయ్యారు.
JPSC మరియు JSSC ఉద్యోగాల కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై మాజీ జేపీఎస్సీ (JPSC) ఛైర్మన్ ఎల్. ఖియాంగ్తేను సీఐడీ అరెస్ట్ చేసింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఆయనను సీఐడీ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ రాంచీలో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న తరుణంలో ఈ అరెస్టు జరిగింది.
అరెస్టును సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ కౌశిక్ ధ్రువీకరించారు. నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి ఖియాంగ్తేను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సీఐడీ మరియు ఈడీ (ED) లతో సమగ్ర విచారణ జరిపించడంతో పాటు, విద్యార్థుల డిమాండ్ మేరకు 14వ జేపీఎస్సీ పరీక్షతో పాటు 2023, 2025 బ్యాక్‌లాగ్ నియామక పరీక్షలను రద్దు చేయడానికి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకరించింది.
Also Read:ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ నో!
ఈ కేసులో దర్యాప్తు తీవ్రతరం కావడంతో జేపీఎస్సీలోని ముగ్గురు సభ్యులు…అజీతా భట్టాచార్య, అనిమా హన్స్ దా, జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు. సీఐడీ విచారణకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో అజీతా భట్టాచార్య జేఎంఎం (JMM) నాయకుడు సుప్రియో భట్టాచార్య భార్య కావడం గమనార్హం. మాజీ ఛైర్మన్ ఖియాంగ్తే అరెస్టుతో ఈ కుంభకోణంలో జార్ఖండ్ సీఐడీ ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 20కి చేరింది.

