2022 మార్చిలో రిలీజ్ అయిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పోందిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అక్టోబర్21న జపాన్‌లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అభిమానులను అకట్టుకున్నారు.
అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మిల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ జపనీస్‌లో భాషలో మాట్లాడారు. అనంతరం ఇంగ్లీష్‌లో తన ప్రసంగాన్ని కొనసాగించారు. మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏవైనా తప్పులుంటే మన్నించండి. నేను జపాన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలనిపిస్తోంది అంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఎన్టీఆర్ గతంలో నటించిన అనేక చిత్రాలు జపాన్ లో విడుదలై విశేష ప్రజాదరణ పొందాయి. దీంతో ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, ఒలివియా మోరిస్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా…. వరల్డ్ వైడ్‌గా రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించారు.