సీసీపీ నుంచి హుజింటావోను బయటకు తీసుకెళ్లిన స్టీవార్డ్స్‌

346
- Advertisement -

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీసీపీ) సమావేశాల్లో భాగంగా మాజీ అధ్యక్షుడు హుజింటావోను బయటకు తీసకెళ్లారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సంఘటనలో… ఎడమ వైపున కూర్చున్న జిన్‌పింగ్‌ సైలెంట్‌గా ఉండటం పెద్ద చర్చనీయంశంగా మారింది. హుజింటావో జిన్‌పింగ్‌కు కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేశారు.

హు జింటావో వద్దకు వచ్చిన స్టీవార్డ్స్‌ ఆయనతో ముచ్చటించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న జిన్‌పింగ్‌ ఏమీ మాట్లాడలేదు. నిజానికి అక్కడ ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ హు జింటావోను బలవంతంగానే సమావేశాల నుంచి బయటకు లాక్కెళ్లినట్లు కనిపించింది.

హు జింటావో వయసు 79 ఏళ్లు. సమావేశాల ప్రారంభం రోజున కూడా హు జింటావో నిలకడగా లేరని తెలుస్తోంది. ఓపెనింగ్‌ సెర్మనీకి కూడా ఆయన్ను ఇద్దరు వ్యక్తులు స్టేజ్‌ మీదకు తీసుకువచ్చారు. స్టీవార్డ్స్‌ తీసుకువెళ్తున్న సమయంలో హు జింటావో.. ప్రధాని లీ కీక్వాంగ్‌ భుజంపై చేయి వేశారు. సమావేశాల నుంచి వెళ్లిపోవడానికి ఇష్టం లేకున్నా.. బలవంతంగా హు జింటావోను తీసుకువెళ్లినట్లు వీడియోలో కనిపించింది. 2013లో జింటావో రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యారు.

అయిదేళ్లకు ఒకసారి జరిగే సీపీసీ సమావేశాలు గత ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఇవాళ ముగింపు సమావేశాల సందర్భంగా కొన్ని తీర్మానాలను ఆమోదించారు. అయితే మూడవసారి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు జిన్‌పింగ్ చేసిన తీర్మానం కూడా పాసైనట్లు తెలుస్తోంది.

- Advertisement -