ముదురుతున్న ‘మా’ వ్యవహారం.. బండ్ల గణేష్‌పై జీవితా కామెంట్స్‌..

88

‘మా’ ఎన్నికల వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఎలక్షన్‌ ఇంకా జరగకముందే ప్రకాష్‌ రాజ్ ప్యానెల్‌లో కలకలం రేగింది. ప్రకాష్‌ రాజ్ ప్యానెల్ నుంచి నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తప్పుకోవడం తెలిసిందే. ‘మా’ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నట్టు బండ్ల గణేశ్ ప్రకటించారు. అయితే ఇటీవల జీవితా రాజశేఖర్.. ప్రకాష్‌ రాజ్ ప్యానెల్లో చేరారు. అయితే ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్లోకి రావడం పట్ల బండ్ల గణేశ్ అసంతృప్తితో ఉన్నట్టు, అందుకనే ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జీవితా రాజశేఖర్‌ స్పందించారు.

‘‘మా’ అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.