కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి. కార్యకర్తల సమక్షంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ…ఫిరాయింపులు మంచివి కావని పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా పట్టించుకోలేదు అన్నారు. తాను, తన అనుచరులు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీవ్ర బాధతో పార్టీని వీడుతున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్‌లో చేరలేదు. నువ్వు సీఎం అయ్యావు, కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు” అంటూ విమర్శించారు. అలాగే, “నాకు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య?” అంటూ ప్రశ్నించారు. నీ తొక్కుడు కాదు, ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు అని అన్నారు.
ఇక ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి “అతనికి కాంగ్రెస్‌తో సంబంధం ఏమిటి? సలహాదారుడిగా నియమించిన తర్వాత ఏం సలహాలు ఇచ్చాడు?” అని ప్రశ్నించారు. అలాగే వేమ్ నరేందర్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం సహా చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాల్లో పార్టీ ఓటమికి కారణం సీఎం నిర్ణయాలేనని పేర్కొన్నారు. చేవెళ్లలో తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి, తర్వాత బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డిని తీసుకుని టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని అన్నారు.
Also Read:చమురు సంక్షోభం..ఎంపీల నిరసన
చివరిగా, “రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా. అణగదొక్కబడటం కంటే పోరాటం చేయడం మంచిది” అంటూ ఆయన స్పష్టం చేశారు.

