బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.
ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం కాకుండా, తన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.
“రేవంత్ రెడ్డికి అధిష్ఠానం అంటే ఢిల్లీలోని కాంగ్రెస్ కాదు.. ప్రధాని మోదీ మాత్రమే. ఆయన కనుసన్నల్లోనే రాష్ట్ర పాలన సాగుతోంది” అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు మంజూరైందని గుర్తు చేసిన ఆయన, మెట్రో విస్తరణపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిని అటకెక్కించి కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రైతాంగానికి మేడిగడ్డ ప్రాజెక్టు జీవనాడి అని, అధికారంలోకి రాగానే దాని మరమ్మతులు చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా పట్టించుకోకుండా.. ఇంకా ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? అని ఘాటుగా విమర్శించారు.
పంట నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఏమైందని నిలదీశారు. పంట కోతకు వస్తున్నా రైతు భరోసా డబ్బులు వేయకపోవడం, పంట బీమా పథకాన్ని అటకెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా శేష జీవితం కేసీఆర్ నాయకత్వంలోనే గడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:సిక్స్‌లు ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేయను!

