నటి రష్మిక మందన్న హిందీ ఉచ్చారణపై వస్తున్న విమర్శలకు ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మద్దతుగా నిలిచారు. దక్షిణాది యాసతో హిందీ మాట్లాడుతున్నందుకు రష్మికను ట్రోల్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో ఆమెను తమిళ నటిగా పేర్కొనడంతో సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తన తప్పును అంగీకరించిన జావేద్ అక్తర్.. రష్మికను వ్యక్తిగతంగా తనకు తెలియదని చెబుతూ క్షమాపణలు తెలిపారు.
ఇటీవల తన భర్త, నటుడు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడారు. తన నటన, భాష, ఉచ్చారణ వంటి అనేక అంశాలపై విమర్శలు వస్తుంటాయని తెలిపారు. అయితే ఒకే పరిశ్రమకు, ఒకే భాషకు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, అన్ని భాషల్లోనూ నటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రష్మికకు మద్దతుగా జావేద్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళ నటి రష్మిక ఉచ్చారణపై అభ్యంతరాలు వ్యక్తం చేసేవారికి కొన్ని తమిళ వాక్యాలు ఇచ్చి చదివించాలని, వారు ఎంత బాగా పలుకుతారో చూడాలని వ్యాఖ్యానించారు. ఇతరుల భాషను ఎగతాళి చేయడం తప్పుడు భాషా ఆధిక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
జావేద్ అక్తర్ రష్మికను తమిళ నటిగా పేర్కొనడంపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆమె కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన కన్నడిగ అని, తెలుగు సినిమాల్లోనూ విస్తృతంగా నటించారని గుర్తుచేశారు. దక్షిణ భారతదేశంలోని వివిధ భాషలు, ప్రాంతాల మధ్య తేడాలను గుర్తించాలని సూచించారు. దీంతో తన వ్యాఖ్యలో పొరపాటు జరిగిందని జావేద్ అక్తర్ అంగీకరించారు. రష్మికను వ్యక్తిగతంగా తనకు తెలియదని, ఆమె నటించిన సినిమాల్లో తాను చూసింది ఒక తమిళ సినిమా మాత్రమేనని వివరించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఏ భాష అన్నది ఇక్కడ సమస్య కాదని స్పష్టం చేశారు.
Also Read:FMCG:సామాన్యులకు మరో షాక్..

