జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నారు. జూలై మొదటి వారంలో (జూలై 1 నుంచి 3 వరకు) ఈ పర్యటన ఉండవచ్చని దౌత్యవర్గాల సమాచారం. మొదట ఈ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని అస్సాంలోని గువాహటిలో నిర్వహించాలని భావించినప్పటికీ కొన్ని నిర్వహణా పరమైన కారణాల వల్ల ఈ కీలక సదస్సును దేశ రాజధాని న్యూఢిల్లీకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకైచి భారత్‌కు రావడం ఇదే తొలిసారి.
ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని తకైచి… భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ ఇరు దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా కింది అంశాలపై దృష్టి సారించనున్నారు. సెమీకండక్టర్ల (చిప్స్) తయారీ, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగాల్లో సరికొత్త జపాన్ పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడంతో పాటు, ఇరు దేశాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.సౌరశక్తి పెంపుదల, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు మరియు గ్రిడ్ భద్రత వంటి పర్యావరణ అనుకూల ఇంధన రంగాలపై ఇరు దేశాల ప్రతినిధులు ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు.
Also Read:టీఎంసీ సుప్రీమోగా మళ్లీ మమత?
ఈ పర్యటనలో జపాన్ ప్రధానితో పాటు ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీల నుంచి సుమారు 50 మందికి పైగా అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌కు రానున్నారు. ఇది భారతదేశంలో తయారీ రంగానికి పెద్ద ఊతం ఇవ్వనుంది. పశ్చిమ ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు ఇంధన భద్రతపై కూడా ఇరు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ, తకైచిల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక సమావేశం భారత్-జపాన్ ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

