ఓటమి ఓ పాఠమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన ఓటమికి గల కారణాలపై పార్టీ నేతలతో చర్చించిన పవన్ తుది శ్వాస ఉన్నంత వరకు పార్టీని ముందుకు తీసుకెళ్తునే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీకి బలమైన క్యాడర్ ఉందని..ఓటమికి వ్యక్తులను కారణంగా చూపరాదన్నారు. పార్టీకి ఉన్న జన బలాన్ని పార్టీ కోసం వినియోగించుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని నేతలకు సూచించారు. ఒక్కోసారి ఊహించని ఫలితాలు చూడాల్సి ఉంటుందని, అలాంటి వాటిని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక, ముందుచూపు అవసరమన్నారు.
తాను పోటీ చేసిన రెండు చోట్లా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయినట్లు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన.. ప్రస్తుత రాజకీయ వ్యవహారాల కమిటీ గడువు ముగిసిందని, త్వరలో నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ భావజాలం, నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేసేందుకు జనసేన పార్టీ మాస పత్రికను తీసుకు వస్తున్నట్లు పవన్ వెల్లడించారు. సెప్టెంబరులో పత్రిక తొలి సంచిక విడుదలవుతుందన్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ జనసేన ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. స్వయంగా పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.