జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ ద్వారా బీజేపీ ముందు ఐదు ప్రశ్నలు అడగదల్చుకున్నట్లు వెల్లడించారు. 1. గోవధ, 2. రోహిత్ వేముల ఆత్మహత్య, 3. దేశభక్తి, 4. నోట్ల రద్దు, 5. ఏపీకి ప్రత్యేక హోదా పైన ఆయన ట్విట్టర్లో ప్రశ్నలు కురిపించారు. ఈ పై ఐదు అంశాలు చాలా కీలకమైనవని చెప్పారు.
బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో దమ్ముంటే గోవధను నిషేధించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు లెదర్ బూట్లు, లెదర్ షూలు వేసుకోవద్దని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో గోవధను ఎందుకు నిషేధించలేదో చెప్పాలని నిలదీశారు. గో రక్షణ కోసం తాను ఓ సూచన చేశానని, ప్రతి బీజేపీ కార్యకర్త ఓ గోవును దత్తత తీసుకోవాలని చెప్పానని అన్నారు. అప్పుడే గోవధ పైన సీరియస్ నెస్ కనిపిస్తుందన్నారు.
సీనియర్ రాజకీయి నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, ఇంకా వివిధ వర్గాల ప్రజలనుంచి ఈ కీలక సమాచారాన్ని సేకరించినట్టు చెప్పారు. ముఖ్యంగా బీజేపీని నమ్మి ఓట్లేసిన వారిని నుంచి సేకరించానని పేర్కొన్నారు.
బీజేపీ-టీడీపీ కూటమికి ఏపీ, తెలంగాణలో కర్ణాటకలో బీజేపీకి జనసేన మద్దుతిచ్చిందని గుర్తు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై రేపు ప్రశ్నిస్తానంటూ ట్వీట్ చేశారు. మిగతా మూడు అంశాల పైన రోజుకొకటి చొప్పున మాట్లాడనున్నారు.