ప్రతి ఊరిలో జమ్మి మొక్కలు…

718
jammi chettu
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలోని వివిధ వర్గాలు మొక్కలు నాటే విధంగా ప్రోత్సహిస్తున్న ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’..రాబోయే దసరా పండుగను పురస్కరించుకొని సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జమ్మి మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘ప్రతి ఊరిలో జమ్మి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సృష్టికర్త, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

విజయదశమి ఉత్సవాల్లో జమ్మి చెట్టుకు ఉన్న ప్రాధాన్యం, ఇక్కడి ప్రజల సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం తీసుకున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. దసరా నాటికి తెలంగాణలో జమ్మి చెట్టులేని ఊరు ఉండకూడదు అనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈమేరకు అన్ని గ్రామాల్లోని గుడి లేదా బడిలో జమ్మి మొక్కలు నాటుతామని తెలిపారు. జమ్మి చెట్టు ప్రాశస్త్యం, నాటిన మొక్కల రక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమం అమలు కోసం గుడి లేదా బడిని ఎంచుకున్నట్లు వివరించారు. ‘ప్రతి ఊరిలో జమ్మి’ కార్యక్రమంలో వివిధ వర్గాలతోపాటు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు భాగస్వాములవుతాయని పేర్కొన్నారు. ఎక్కడికక్కడే నాటటానికి కావాల్సిన జమ్మి మొక్కలను సమకూర్చుకుంటారని, అడిగిన వారికి పంపిణీ చేయటం కోసం సంస్థ తరఫున 20వేల జమ్మి మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

జమ్మి మొక్కలే ఎందుకు? రాష్ట్రంలో జమ్మి చెట్లు తక్కువగా ఉన్నాయి. పైగా జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని అనేక గ్రామాల ప్రజలు జమ్మి చెట్టును పూజించటానికి, దాని ఆకులు తెచ్చుకోవటానికి రెండు, మూడు కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మేరకు ఉభయ తారకంగా (పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాలను కాపాడటం) ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి దసరా సందర్భంగా ‘ప్రతి ఊరిలో జమ్మి’ కార్యక్రమం తీసుకున్నట్లు ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -