తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగురవేసి, తీవ్ర ఆరోపణలు చేసిన నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనదైన శైలీలో రేవంత్‌ను చడామడా తిట్టేసిన జగ్గారెడ్డి… ఓ దశలో పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. జగ్గారెడ్డి తీరుతో ఆయన్ను పార్టీ నుండి బహిష్కరిస్తారని కూడా గాంధీభవన్ వర్గాలు అనధికార లీకులు ఇచ్చినా తను మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే, అధిష్టానం మీటింగ్‌తో కాస్త తగ్గిన జగ్గారెడ్డి ఇప్పుడు తన రూటు మార్చారు. ఇటీవల రాహుల్ గాంధీ సమావేశాల్లో జగ్గారెడ్డికి కూడా ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓయూ షెడ్యూల్ కోసం జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టీఆర్ఎస్ ను, ఓయూ పాలకమండలిని గట్టిగానే విమర్శించారు.
అయితే రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో అసంతృప్త నేతలకు సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం, మీడియాకు ఎవరైనా ఎక్కితే ఎంత పెద్ద నేత అయినా వదిలేదు లేదని తెగేసి చెప్పటంతో జగ్గారెడ్డి తన రూటు మార్చుకున్నట్లు కనపడుతుంది. నేతలరా… హైదరాబాద్ వదిలి వెళ్లండి. గ్రామాల్లో ఉంటూ కార్మిక, కర్షక, ఉద్యోగ, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలంటూ పిలుపునివ్వటంతో జగ్గారెడ్డి సంగారెడ్డికి మకాం మార్చారు. పల్లే బాట కార్యక్రమంతో పూర్తిగా జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే పల్లేల్లోనే నిద్ర చేసేలా తన ప్లానింగ్ ఉంటుందని జగ్గారెడ్డి వర్గీయులంటున్నారు.
తద్వారా రాహుల్ సూచనను పాటించినట్లు అవుతుందని చెప్తున్నారు. అయితే, జగ్గారెడ్డి సంగారెడ్డికి మకాం మార్చటం వెనుక మరో కథనం కూడా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలిని తట్టుకొని కూడా బయటపడ్డారు. కానీ, ఈసారి జగ్గారెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించనుంది. పైగా తను ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదు. ఈ వ్యతిరేకత కూడా తోడైతే తను మళ్లీ గెలవలేనని అర్థం కావటంతోనే జగ్గారెడ్డి జనం బాట పట్టారని, వచ్చే ఎన్నికల కోసమే జగ్గారెడ్డి ఇదంతా చేస్తున్నారంటున్నారు ప్రత్యర్థి వర్గాలు.