ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనుండగా తాజాగా ఆ పార్టీకి మరోషాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య,పిల్లల పేరుతో గుజరాత్‌కు చెందిన ఇతరులను అమెరికా తీసుకెళ్లి అక్కడే వదిలి వోచ్చారన్న ఆరోపణలతో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పటాన్‌చెరులో ఓ కార్యక్రమానికి హాజరైన జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. గుజరాత్ పోలీసులు అందించిన సమాచారంతో జగ్గారెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. ఇదే కేసులో సంగారెడ్డికి చెందిన జెట్టి కుమార్,మధుసుదన్ రావులను పోలీసులు విచారిస్తున్నారు.
జగ్గారెడ్డి 14 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లేందుకు తనతో సహా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో మొత్తం నలుగురికి పాస్‌పోర్టులు, వీసాలు తీసుకున్నారు. అయితే, తిరుగు ప్రయాణంలో అమెరికా నుంచి ఆయన ఒక్కరే వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.దీంతో మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. జగ్గారెడ్డి అమెరికాకు ఎవరిని తీసుకెళ్లారు? ఎందుకు అక్కడ వదిలి వచ్చారు? అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది.