ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌

80
- Advertisement -

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్‌ మొదలైంది. ధన్‌కర్‌ గెలుపును అధికారికంగా ప్రకటించారు లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌.

మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్‌ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్‌ సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇందులో అధికార పక్ష అభ్యర్థి ధన్‌కర్‌ 528 ఓట్లు సాధించారని, విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్నికలో 346 ఓట్ల తేడాతో ధన్‌కర్‌ గెలిచినట్లు ప్రకటించారు. భారత ఉపరాష్ట్రపతిగా ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో జగ్‌దీప్‌ జన్మించారు. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి తల్లిదండ్రులు యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న తర్వాత రాజస్థాన్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 1993-98 మధ్య అజ్మేర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. మమత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు.

- Advertisement -