జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ రాజకీయాలు చర్చి నుంచి గుడికి మారిపోయాయి. గత ఎన్నికల్లో ఓటమి కారణమో లేదా పసుపు రంగ పార్టీని ఓడించేందుకు కాషాయానికి దగ్గరయ్యేందుకు వేసిన ఎత్తుగడో కాని కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామిని జగన్ కలవడం పొలిటికల్ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఓ వివాహ వేడుకలో చినజీయర్ స్వామిని కలిసిన జగన్…నవంబర్‌లో మొదలు కానున్న పాదయాత్ర నేపధ్యంలో చినజీయర్‌ని కలవడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శంషాబాద్‌లోని చినజియర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన జగన్ సుమారు 30 నిముషాలపాటు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలతో పాటు పాదయాత్ర ముహుర్తంపై కూడా జగన్ చర్చించినట్లు సమాచారం.
కొద్దిరోజులుగా జగన్‌లో వస్తున్న మార్పు వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్దికాలంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతునిచ్చారు. అదీగాక జగన్‌పై క్రిస్టియన్ అనే ముద్ర ఉంది. గత ఎన్నికల్లో ఆయన పార్టీ కొద్దిలో అధికారానికి దూరమైంది. దీనికి ఆ ముద్ర కూడా ఎంతో కొంత కారణం. దీన్ని తొలగించుకోవడానికి జగన్ ఇలా స్వామిజీలను కలవడం, యాగాలు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని మరి కొందరు భావిస్తున్నారు.
అంతేగాదు ఇప్పటివరకు చంద్రబాబును ఢికొట్టేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగించిన జగన్…తనకు కలిసివచ్చే ఏ చిన్న అంశాన్ని కూడా వదులుకోవట్లేదు. అందులో భాగంగానే విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామిని బాగా కలిసే జగన్…ఇప్పుడు చినజీయర్‌ని మోక్షం చేసుకుంటున్నారు. త్వరలో తిరుమల శ్రీవారిని కాలినడకన వెళ్లి జగన్ దర్శించుకోనున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద జగన్ వైఖరిలో మార్పు పట్ల వైసీపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.