సీఎం కేసీఆర్ పాలనలో వైద్య సేవలు ఎంతగానో విస్తరించాయి: మంత్రి

90
Minister Jagadish Reddy
- Advertisement -

అవసాన దశలో ఉన్న వారికి స్వాంతన చికిత్స కేంద్రం సేవలు అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఇన్ పేషేంట్లతో పాటు ఔట్ పేషేంట్లకు కుడా వైద్యసేవలు అందిస్తారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు ఎంతగానో విస్తరించాయని ఆయన కొనియాడారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాలకు అనుబందంగా ఏర్పాటు చేసిన పాలియోటివ్ కేర్ (స్వాంతన చికిత్సా కేంద్రం)ను ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతూ అవసాన దశకు చేరుకున్న వారికి ఈ కేంద్రంలో చికిత్సలు అందిస్తారన్నారు.ఇందులో చేరి చికిత్సలు పొందిన మీదట యింటికి వెళ్లిన వారికి కుడా అవసరమైతే హోంకేర్ చికిత్సలు అందిస్తారని ఆయన తెలిపారు. అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ఇక్కడ ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ కేంద్రంలో చేరిన వారికి పొష్టికాహారం అందించడం తో పాటు మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తారని ఆయన చెప్పారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆశా వర్కర్ల ద్వారా ఎనిమిది లక్షల 65 వేల 365 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 25 వేల 335 మందికి స్వాంతన కేంద్రంలో చికిత్సలు అవసరమని తేలిందన్నారు.హోంకేర్ చికిత్సల నిర్వహణకు గాను ప్రత్యేక వాహనం వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జడ్ పి వైస్ ఛైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్,జడ్ పి టి సి జీడీ బిక్షం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,డి యం హెచ్ ఓ కోటాచలం,ఆసుపత్రి సూపరెండేంట్ డాక్టర్ మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -