సూర్యపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు. నర్సరీలు పెంచేది, మొక్కలు నాటేది, వాటి సంరక్షణను చూసే బాధ్యత ఇకపై గ్రామ పంచాయతీలదేనన్నారు. పచ్చదనంతో పాటు పరిశుభ్రతను కాపాడటంలో గ్రామపంచాయతీల పాత్ర కీలకమన్నారు.
ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ పథకంతో నీళ్లు అందిస్తున్నామని తెలిపిన ఆయన ప్రతీ ఊరిలో స్మశాన వాటికలను నిర్మించాలన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులు జాతీయ ఉపాధిహామీ పథకంలో తగినంత ఉన్నాయన్నారు.
పరిశుభ్రతను కాపాడేందుకుగాను సవరించిన పంచాయతీరాజ్ చట్టంలో విస్తృస్థాయి అధికారాలను సర్పంచ్‌లకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. పల్లెల్లో మంచినీటి ఎద్దడిని నివారించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.