సాఫ్ట్‌వేరు ఉద్యోగులకు వారంలో రెండు రోజులు సెలవు.. ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవురోజుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఏమైన ముఖ్యమైన పనులుంటే ఆ రోజే పూర్తి చేసుకుంటాం. మళ్లీ తెల్లారితే ఆఫీసుకి బయలుదేరాల్సిందే బద్దకంగా.. అదే ఏకంగా మూడురోజులు విశ్రాంతి దొరికితే..? పండగ చేసుకుంటాం. ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని… వారానికి మూడు రోజుల సెలవు దొరుకుతుందని చెబుతున్నారు అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు జాక్ మా. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయం కానుందని అంటున్నారీయన.
జాక్ మా… చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ అలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ‘‘వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే..’’ అని జాక్ మా పేర్కొన్నారు. గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ‘‘ మా తాతగారు పొలంలో రోజుకు 16 గంటలు పనిచేశారు. దీన్ని బట్టి అప్పుడు చాలా బిజీగా ఉండి ఉంటారు. ఇప్పుడు మనం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నాం. అది కూడా వారానికి 5 రోజులు పని చేస్తూ చాలా బిజీగా ఉన్నట్టు అనుకుంటున్నాం’’ అని మా చెప్పుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ పైనా వివరంగా మాట్లాడిన ఈ చైనా బిలియనీర్…. ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజు రోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. అది యుద్ధానికి కూడా దారితీయవచ్చునని పేర్కొన్నారు. ‘‘మూడోతరం టెక్నాలజీ విప్లవం… మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు…’’ అని మా పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(కృత్రిమ మేథ), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తక్కువ మంది సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయి. ఆటోమేషన్ కనుక వస్తే మా చెప్పినట్టు.. రోజు నాలుగు గంటల్లోనే పని పూర్తవుతుంది. వారానికి మూడు రోజుల సెలవు దొరుకుతుంది..ఈ ప్రభావం ఉద్యోగాలపై పడే ప్రభావం కూడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.