నోట్ల రద్దుతో కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు మరో తలనొప్పి వచ్చి పడింది. పెద్ద నోట్లు రద్దు చేసి మూడు వారాలు గడుస్తున్నా ప్రజల కష్టాలు కడతేరకపోగా మరింత ఎక్కువ అవుతున్నాయి. తాజాగా రద్దైన రూ.500 నోటుతో రిటైలర్ల వద్ద మొబైల్ రీఛార్జ్ చేయించుకున్న వారి నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది. పాత రూ.500నోటుతో రూ.500వరకు ప్రీ-పెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేయించుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం తాజాగా అలా చేయించుకున్న వారి నంబర్లను తమకు పంపాలని టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది.
పాత రూ.500నోటుతో ఫ్రీ-పెయిడ్ టాపప్స్ పొందే అవకాశాన్ని డిసెంబరు 15వరకు కల్పిస్తూ గురువారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో.. ఎవరెవరు వీటిని వినియోగించుకుంటున్నారో ఒక కన్నేసి ఉంచాలని భావిస్తోంది. దేశంలో 90 శాతం మంది ప్రీపెయిడ్ కనెక్షన్లనే ఉపయోగిస్తున్నట్లు ఓ అంచనా. దేశంలో 90శాతం మంది ప్రీ-పెయిడ్ మొబైల్ సేవలు కల్గి ఉండటం వలన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ తెలిపారు. ఈ మేరకు సర్కారు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిటైరర్ల వద్ద ఆ కస్టమర్ల నెంబర్లను తీసుకుంటున్నారు.