దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రక్రియలో భాగంగా ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ 11న ఎన్నికల పోలింగ్, మధ్యలో ఓ రోజు గడిస్తే రెండు వీకెండ్ హాలిడేస్. దీంతో ఓటు వేయకుండా హాలీడే ట్రిప్‌కు వెళ్లాలనుకునే వారికి ఐటీ కంపెనీలు షాకిచ్చాయి.పోలింగ్ రోజు తప్పనిసరిగా ఓటుహక్కు వేయాలని బెంగళూరు,మైసూరు ప్రాంతంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాదు ఓటు వేసినట్టుగా మరుసటి రోజు హెచ్‌ఆర్ విభాగంలో ఆధారం చూపాల్సిందే లేదంటే వేతనంలో కోత తప్పదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
శుక్రవారం ఒకరోజు లీవ్ పెడితే సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో ఆలోచనలో పడ్డారు. ఐటీ సంస్థలు హెచ్చరికలతో ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం సూచన మేరకు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇన్ఫోసిస్, యాక్సెంచర్ సహా పలు కంపెనీలు ఈమేరకు ఉద్యోగులకు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు.