అందరి చూపు నిజామాబాద్ వైపే..

378
mp kavitha

తొలిదశ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక నిజామాబాద్‌లో అత్యధికంగా 185 మంది బరిలో ఉండటంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసీ. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరగనుంది.

ఈ ఎన్నిక కోసం దేశచరిత్రలోనే తొలిసారిగా ఎమ్‌-3 ఈవీఎంను ఉపయోగిస్తున్నారు. 7 అసెంబ్లీ నియోజవర్గాల్లో మొత్తం 15 లక్షల 50 వేల మంది ఓటర్లుండగా అందులో 2 లక్షల మంది రైతులే ఉన్నారు. ఓటింగ్‌ కోసం ఒక వెయ్యీ 788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు అవగాహన కోసం ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మోడల్ పోలింగ్ సెంటర్స్ ఏర్పాటుచేశారు.

ఈ ఎన్నిక కోసం 27 వేల బ్యాలెట్ యూనిట్లు, 2,150 వివి ప్యాట్ యంత్రాలు, 2,150 కంట్రోల్ యూనిట్లు ఉపయోగిస్తున్నారు. ఇక సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు భేల్ కంపెనికి చెందిన 6 వందల మంది ఇంజనీర్లు రెడీగా ఉండగా 5 పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక సెక్టార్‌ అదికారి, ఓ ఇంజనీర్ కూడా రెడీగా ఉన్నారు. ఇక అత్యవసర పరిస్తితుల్లో హెలికాప్టర్‌ను కూడా ఉపయోగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పరిశీలించే ఏర్పాట్లు చేశారు.

ఇక బరిలో టీఆర్ఎస్‌ నుండి సీఎం కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కవిత,కాంగ్రెస్ నుండి మధుయాష్కి,బీజేపీ నుండి ధర్మపురి అరవింద్‌తో పాటు 178 మంది రైతులు బరిలో ఉన్నారు.