భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశియ నావిగేషన్ సమాచారం కోసం రూపొందించిన పీఎస్‌ఎల్‌వీ సీ41ను ఇస్రో విజయంతంగా నింగిలోకి పంపి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ రాకెట్ కేంద్రం ఒకటో లాంచింగ్ ప్యాడ్ నుంచి గురువారం ఉదయం 4.04 గంటలకు పీఎస్‌ఎల్వీ- సి 41 రాకెట్‌ను నింగిలోకి పంపింది.
19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది పీఎస్‌ఎల్వీ సీ41. నాలుగు దశల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం నిర్ణయించిన సమయానికి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 1425 కిలోలు. ఇప్పటి వరకు ఇస్రో 8 నావిగేషన్ శాటిలైట్లను నింగిలోకి పంపింది. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం ఉష్ణ కవచం తెరుచుకోకపోవడంతో బయటకు రాలేదు. దాంతో విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది. కానీ దాని స్ధానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది.
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా స్థితి, దిక్సూచి, సమయ సేవలు విశ్వసనీయ స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. భారత్ చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలు లభ్యమవుతాయి. విపత్తు నిర్వహణ, వాహనాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వాహన సమూహ నిర్వహణ, మొబైల్ ఫోన్లతో సంధానతకు, సమయాన్ని కచ్చితత్వంతో తెలియజేయడానికి, మ్యాపింగ్‌కు ఉపయోగపడుతుంది.