ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ

4
- Advertisement -

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక దౌత్యపరమైన ముందడుగు పడింది. ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయడానికి ప్రాథమికంగా అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందం పూర్తిగా హెజ్బుల్లా సాయుధ బలగాల చర్యలపైనే ఆధారపడి ఉంటుందని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుండి హెజ్బుల్లా తన పోరాటాన్ని పూర్తిగా నిలిపివేసి, అక్కడి నుండి తన ఉగ్రవాదులను, మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగిస్తేనే ఈ సీజ్‌ఫైర్ కొనసాగుతుంది.

అమెరికా విదేశాంగ శాఖ (స్టేట్ డిపార్ట్‌మెంట్) ఆధ్వర్యంలో జరిగిన దాదాపు తొమ్మిది గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు ఈ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే జూన్ 22వ తేదీన ఉభయ దేశాల రాజకీయ, భద్రతా ప్రతినిధులు మళ్లీ భేటీ అయి ఒక దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు.

ఈ తాత్కాలిక శాంతి చర్యల్లో భాగంగా సరిహద్దు వెంబడి కొన్ని ‘పైలట్ జోన్లను’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాలలో లెబనాన్ అధికారిక సైన్యం (LAF) మాత్రమే పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది. హెజ్బుల్లా వంటి ఏ ఇతర అనధికారిక సాయుధ దళాలకూ అక్కడ ప్రవేశం ఉండదు. ఈ భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేయడానికి అమెరికా లెబనాన్ సైన్యానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

Also Read:ఓటర్ల జాబితా ‘వడపోత’పై అప్రమత్తం!

ఒప్పందానికి అంగీకరించినప్పటికీ, ఇరు దేశాలూ తమ సొంత దేశ రక్షణకు సంబంధించిన కీలక డిమాండ్లను ఉంచాయి. ఇజ్రాయెల్ తన దేశ సరిహద్దు భద్రత కోసం హెజ్బుల్లాను పూర్తిగా నిరాయుధులను చేయాలని పట్టుబట్టగా….లెబనాన్ ప్రతినిధులు మాత్రం ఇస్రాయెల్ తమ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ సరిహద్దులను గౌరవించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -