తెలంగాణ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ ను కొత్త కొత్త సమస్యలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే టికెట్ల అమ్మకాల విషయం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లను అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తుండడంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది. సొంత పార్టీ నేతలను రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయించేందుకు రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని పార్టీలోని కొంతమంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేల రిపోర్టులంటూ రేవంత్ రెడ్డి తన వర్గం వారికే టికెట్లు కేటాయిస్తున్నారని, మిగిలిన టికెట్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కురువ విజయ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ వంటి వారు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. .
ఎన్నికల ముందు పార్టీ చీఫ్ పై ఇలాంటి ఆరోపణలు రావడం.. పార్టీ బలాన్ని తీవ్రంగా దెబ్బ తీసే అంశం. ఈ వ్యవహారంతోనే కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతుంటే.. మరికొంత మంది నేతలు కొత్త సమస్యకు తెర తీశారు. కాంగ్రెస్ నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీలోని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి సిఎం అభ్యర్థి రేస్ లో చాలమంది నేతలే ఉన్నారు.
రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క.. ఇలా చాలమందే ఉన్నారు. వీరంతా సిఎం అభ్యర్థిగా ఉండేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని కొంతమంది నేతలు సిఎం అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయంతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. అయితే బడుగు బలహీన వర్గాల నుంచి సిఎం అభ్యర్థిగా నిలపాలని స్వయంగా సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తుండడంతో అధిష్టానం ఆ దిశగా నిర్ణయం తీసుకునే సత్తా ఉందా అనే వాదన వినిపిస్తోంది. మరి సిఎం అభ్యర్థి విషయంలో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో హస్తం హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read:పనసతో లాభాలెన్నో..!