దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు..ఫిరాయింపులు, అంతర్గత విభేదాలు మరియు విలీనాలు వెరసీ పార్లమెంటులో NDAని మూడింట రెండు వంతుల మెజారిటీకి చేరువగా తీసుకెళ్లే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేయడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలను ఆమోదించడానికి ఈ మెజారిటీ ఎంతో కీలకం.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగిన నాలుగు రాష్ట్రాలు…ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాయి. దీనివల్ల లోక్‌సభలో బీజేపీ బలం 240 స్థానాలకు, ఎన్‌డీఏ బలం 293 స్థానాలకు పరిమితమైంది.
అయితే ఇటీవల ఐదు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల రౌండ్ తర్వాత, అధికార కూటమి ప్రతిపక్షాలపై పైచేయి సాధించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు ఏకమై అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎన్‌డీఏ రాష్ట్రాల వారీగా తన లక్ష్యానికి చేరువవుతోంది. బెంగాల్‌లో, తృణమూల్ కాంగ్రెస్ (TMC) కి చెందిన 20 మంది అసంతృప్త ఎంపీలు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) లో విలీనం కావాలనే ప్రతిపాదన ఒకవేళ కార్యరూపం దాల్చితే పెద్ద మార్పు వస్తుంది. ఈ అసంతృప్త వర్గానికి నాయకురాలిగా ఉన్న బరాసత్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఇప్పటికే తాము పార్లమెంటులో ఎన్‌డీఏ మరియు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
మరోవైపు బుధవారం నాడు శివసేన (UBT) కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరారు. లోక్ సభలో 9 మంది సభ్యులున్న ఈ పార్టీ…గురువారం జరిగే పార్లమెంటరీ యూనిట్ సమావేశానికి హాజరుకావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ అసంతృప్త నేతలను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. నాకు ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. పార్టీని వీడటానికి ప్రతి ఎంపీకి రూ.50 కోట్లు ఆఫర్ చేశారని, అందులో రూ.15 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని ఆయన చెప్పారు. అడ్వాన్స్ డబ్బు చేతికి అందే వరకు ఎంపీలు చార్టర్డ్ విమానాలు ఎక్కడానికి కూడా సిద్ధపడలేదని నాకు తెలిసింది అని రౌత్ క్లెయిమ్ చేశారు.
ఒకవేళ శివసేన (UBT) అసంతృప్త నేతల వ్యూహం విజయవంతమైతే లోక్‌సభలో ఎన్‌డీఏ సంఖ్య 319 కి చేరుకోవచ్చు. అలాగూ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP) లో చీలిక రాబోతోందనే ఊహాగానాలు బుధవారం ఊపందుకున్నాయి. రాష్ట్ర మంత్రి..సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ స్పందిస్తూ.. ఎస్పీలో పెద్ద చీలిక రాబోతోందని పేర్కొన్నారు. ఎస్పీలో పెద్ద చీలిక రాబోతోంది. రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖను కూడా అందజేశారు. ఈ పరిస్థితి కేవలం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదు..మొత్తం ఎస్పీ పార్టీనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉంది అని రాజ్‌భర్ ‘X’ లో రాశారు.
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కి తన మాజీ మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సంబంధాలు దెబ్బతినడం బీజేపీకి ఒక అవకాశాన్ని కల్పించినట్లు కనిపిస్తోంది. లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్న డీఎంకేతో బీజేపీ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ప్రస్తుతం 540 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్‌డీఏకి 293 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదం పొందడానికి కూటమికి 360 మంది సభ్యుల మద్దతు అవసరం.
Also Read:2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!
రాజ్యసభలో కూడా సమీకరణాలు మారుతున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్‌డీఏకి ప్రస్తుతం 149 మంది సభ్యులు ఉండగా..బిల్లుల ఆమోదానికి 164 ఓట్లు అవసరం. జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎన్‌డీఏ బలం 155 కి పెరుగుతుందని అంచనా. దీనికి తోడు, ఈ నెల ప్రారంభంలో టీఎంసీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల వల్ల కనీసం మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని 294 మంది సభ్యులలో బీజేపీకి 208 మంది సభ్యుల బలం ఉన్నందున, అక్కడ జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలు కూడా బీజేపీకే అనుకూలంగా మారే అవకాశం ఉంది.

