కలెక్టర్ ఆఫీసా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసా?

4
- Advertisement -

పాలన సాగించాల్సిన ప్రభుత్వ ప్రాంగణాలు అధికార పార్టీ రాజకీయ సంబరాలకు వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వరంగల్ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు జరపడం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ బర్త్‌డే వేడుకలకు భారీగా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనైనా ప్రజాప్రతినిధుల లేదా ఇతర వ్యక్తుల వ్యక్తిగత జన్మదిన వేడుకలు, వేడుకల ప్రచారాలు నిర్వహించడం ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధం. అటువంటిది బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సోనమ్ భార్య

ప్రజా సమస్యలను చర్చించాల్సిన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌ను కాంగ్రెస్ పార్టీ ఆఫీసులా మార్చేశారా?” అని స్థానిక ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను, కార్యాలయాలను స్వప్రయోజనాలకు వాడుకోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -