గుండెలో స్టెంట్..మళ్లీ బ్లాక్ అవుతుందా?

5
- Advertisement -

గుండెకు సంబంధించిన సమస్యల్లో బ్లాకేజీలు చాలా ప్రమాదకరమైనవి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తుంటారు. అయితే స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండె సమస్య పూర్తిగా నయమైనట్లేనా? మళ్లీ అదే చోట బ్లాకేజీ ఏర్పడే అవకాశం ఉందా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి.

స్టెంట్ వేయించుకున్న తర్వాత కూడా రక్తనాళం మళ్లీ పూడిపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. దీనికి ప్రధానంగా రెస్టెనోసిస్, రక్తం గడ్డకట్టడం కారణమవుతాయి. స్టెంట్ లోపల కొత్త కణజాలం పెరగడం వల్ల రక్తనాళం మళ్లీ ఇరుకుగా మారడాన్ని రెస్టెనోసిస్ అంటారు. ఆధునిక స్టెంట్లతో ఈ ప్రమాదం తగ్గినప్పటికీ సుమారు 5 నుంచి 10 శాతం మందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వివరించారు. కొన్నిసార్లు స్టెంట్‌లో రక్తం గడ్డకట్టడం వల్ల అకస్మాత్తుగా రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

స్టెంట్ వేయించుకున్న తర్వాత ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణ అలసట, చేతులు, దవడ, వీపు వైపు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇవి మళ్లీ బ్లాకేజీ ఏర్పడటానికి సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, నియంత్రణలో లేని రక్తపోటు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మళ్లీ బ్లాకేజీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం చేసేవారు, గతంలో బ్లాకేజీ సమస్య ఎదుర్కొన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు సూచించిన మందులను సక్రమంగా వాడకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

స్టెంట్ మళ్లీ బ్లాక్ అయినా చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు చెబుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి బెలూన్‌తో రక్తనాళాన్ని విస్తరించడం మరో స్టెంట్ వేయడం లేదా బైపాస్ సర్జరీ చేయడం వంటి చికిత్సలను సూచిస్తారు.

వైద్యులు సూచించిన రక్తం గడ్డకట్టకుండా చేసే మందులను క్రమం తప్పకుండా వాడాలి. సొంతంగా మందులు ఆపకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వైద్యుల సూచన మేరకు వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. అలాగే రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. గుండెకు స్టెంట్ వేయించుకోవడం చికిత్సలో ఒక భాగం మాత్రమే ఆ తర్వాత కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -