చలికాలం బెస్ట్ రెసిపీ..వెల్లుల్లి సూప్!

4
- Advertisement -

చల్లని వాతావరణంలో వేడివేడిగా సూప్ తాగాలని చాలామందికి అనిపిస్తుంది. అయితే ఎక్కువ పదార్థాలు, పెద్దగా తయారీ అవసరం లేకుండానే ఇంట్లోనే రుచికరమైన వెల్లుల్లి సూప్ తయారు చేసుకోవచ్చు. కేవలం నాలుగు పదార్థాలతో తయారయ్యే ఈ సూప్ రుచితో పాటు మంచి అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించలేని వారికి ఇది మంచి ఎంపిక. కేవలం అరగంటలోనే ఈ సూప్‌ను సిద్ధం చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

వెల్లుల్లి రెబ్బలు – 15 నుంచి 20

ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు

నీళ్లు – 3 నుంచి 4 కప్పులు

ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసి రెండు ముక్కలుగా కోసుకోవాలి. వాటి మధ్యలో ఆకుపచ్చ రంగులో మొలక కనిపిస్తే తొలగించాలి. ఇలా చేయడం వల్ల సూప్‌లో చేదు రుచి రాకుండా ఉంటుంది.

తర్వాత ఒక గిన్నెను స్టవ్‌పై పెట్టి తక్కువ మంటపై ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి సుమారు 10 నిమిషాల పాటు నెమ్మదిగా వేయించాలి. వెల్లుల్లి ముక్కలు మెత్తగా మారి మంచి సువాసన వచ్చే వరకు ఉడికించాలి. అయితే అవి గోధుమ రంగులోకి మారకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువగా వేగితే చేదు రుచి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు అందులో 3 నుంచి 4 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. ఆ తర్వాత మంట తగ్గించి సుమారు 20 నిమిషాల పాటు ఉడికించాలి. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా మెత్తబడిన తర్వాత గరిటెతో వాటిని మెదిపేయాలి. క్రీమీగా ఉండాలనుకుంటే మిక్సర్ లేదా హ్యాండ్ బ్లెండర్‌తో మెత్తగా చేసుకోవచ్చు.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

చివరగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. టోస్ట్ చేసిన బ్రెడ్‌తో కలిపి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.

- Advertisement -