దేశంలో క్రిప్టో చట్టబద్ధమేనా?

2
- Advertisement -

భారతదేశంలో క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతపై చాలారోజులుగా ఎన్నో అనుమానాలు, చర్చలు నడుస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే భారతదేశంలో క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నిషేధం లేదు.కాబట్టి వీటిని కొనడం, అమ్మడం లేదా దాచుకోవడం పూర్తిగా చట్టబద్ధమే. అయితే వీటికి ‘లీగల్ టెండర్’ హోదా లేదు. అంటే మన దేశంలో రూపాయి నోట్లను అధికారిక కరెన్సీగా వాడినట్లు.. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు లేదా జీతాల చెల్లింపులకు క్రిప్టోలను కరెన్సీగా ఉపయోగించలేము.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ప్రభుత్వం వీటిని ‘వర్చువల్ డిజిటల్ అసెట్స్’ లేదా డిజిటల్ ఆస్తులుగా పరిగణిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రిప్టో లావాదేవీలకు బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించింది. ఆర్బీఐ విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో భారత్‌లో క్రిప్టో ట్రేడింగ్ పుంజుకుంది.

కేంద్ర బడ్జెట్‌లో క్రిప్టో లావాదేవీలపై అధికారికంగా పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ ద్వారా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ.. పారదర్శకతను పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో క్రిప్టోలపై కఠినమైన పన్ను విధానం అమల్లో ఉంది. క్రిప్టో ట్రేడింగ్…అమ్మకాలు లేదా స్వాపింగ్ (మార్పిడి) ద్వారా వచ్చే లాభాలపై 30% పన్ను (ప్లస్ 4% సర్‌చార్జ్/సెస్) చెల్లించాలి. మీ ఆదాయ స్లాబ్‌తో సంబంధం లేకుండా ఈ పన్ను వర్తిస్తుంది.

క్రిప్టోను కొనుగోలు చేసిన ధరను మాత్రమే లాభాల లెక్కింపులో మినహాయించుకోవాలి. అంతేకానీ ఎక్స్ఛేంజ్ ఫీజులు లేదా ఇంటర్నెట్ ఖర్చులను క్లెయిమ్ చేయలేరు. ఒక క్రిప్టో కరెన్సీలో వచ్చిన నష్టాన్ని, మరో క్రిప్టోలో వచ్చిన లాభాలతో భర్తీ చేయడానికి వీలులేదు. అలాగే ఈ నష్టాలను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ చేయలేరు. ప్రతి క్రిప్టో లావాదేవీపై (అమ్మకం/మార్పిడి) 1% TDS కట్ అవుతుంది. ఇది ప్రభుత్వం లావాదేవీలను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

క్రిప్టో ఎక్స్ఛేంజీలు మరియు ట్రేడర్లు తమ లావాదేవీల వివరాలను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు కచ్చితంగా రిపోర్ట్ చేయడం తప్పనిసరి లావాదేవీల స్టేట్‌మెంట్లను సకాలంలో దాఖలు చేయకపోతే రోజుకు ₹200 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఐటీఆర్ (ITR) ఫైలింగ్‌లో తప్పుడు సమాచారం ఇస్తే రూ.50,000 వరకు ఫ్లాట్ పెనాల్టీ పడే అవకాశం ఉంది.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

గమనిక:భారతదేశంలో క్రిప్టోలలో పెట్టుబడి పెట్టడం చట్టబద్ధమైనప్పటికీ, దేశీయ చట్టాల ప్రకారం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU-IND) వద్ద నమోదైన మరియు KYC నిబంధనలను పాటించే ఎక్స్ఛేంజీల ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయాలి. క్రిప్టోను ఉపయోగించి పన్ను ఎగవేతకు పాల్పడినా లేదా మనీ లాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు వాడినా తీవ్ర చట్టపరమైన చర్యలు ఉంటాయి.

- Advertisement -