అమెరికా-ఇరాన్ చర్చలు..పసిడిపై మార్క్!

2
- Advertisement -

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను గమనిస్తున్న ఇన్వెస్టర్లు…ట్రేడర్లు బంగారం వైపు మొగ్గు చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన శాంతి ప్రక్రియను పునరుద్ధరించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు వేగంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఉన్న అనిశ్చితి ట్రేడర్లలో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఈ చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో తెలియని గందరగోళంలో మార్కెట్ వర్గాలు ఉన్నాయి.

సాధారణంగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి భారీగా కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సత్ఫలితాలు ఇస్తాయనే ఆశలు ఒకవైపు…మరోవైపు అనిశ్చితి భయాల మధ్య బంగారం కొనుగోళ్లు మందగించాయి.

అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలంగా కొనసాగుతుండటం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచింది. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గుతుంది.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

బంగారం ధరలు ప్రస్తుతానికి ఒక నిర్దిష్ట పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య సంక్షోభంపై అమెరికా తీసుకోబోయే తదుపరి దౌత్యపరమైన నిర్ణయాలు..అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లపై ఇచ్చే సంకేతాల ఆధారంగానే బంగారం తదుపరి గమనం స్పష్టమవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గందరగోళం వీడే వరకు ట్రేడర్లు ఆచి తూచి అడుగులు వేసే అవకాశం ఉంది.

- Advertisement -