ధరణిలో మార్పులా? రద్దా ?

39
- Advertisement -

తెలంగాణలో భూసంరక్షణ కోసం గత బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ప్రజల ఆస్తులను నమోదు చేసుకునేందుకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది గత కే‌సి‌ఆర్ సర్కార్. ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత భూ రిజిస్ట్రేషన్స్, మ్యూటేషన్లు వంటివి సులభతరం కావడంతో పాటు దళారి వ్యవస్థకు తావులేకుండా భూ వివరాలు ప్రభుత్వ పర్యవేక్షణ లో ఉంటాయి. అయితే తాము అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ధరణిపై సి‌ఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చర్చ జోరుగానే సాగుతోంది.

ఇటీవల ధరణి పోర్టల్ పై సమీక్ష నిర్వహించారు సి‌ఎం రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి చూస్తే ధరణిలో మార్పుల దిశగా ఆయన అడుగులు వేస్తునట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ ధరణి రద్దు చేసి ఆ స్థానంలో భూమాత అనే కొత్త పోర్టల్ ను ప్రవేశ పెడతామని చెప్పడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. అయితే మొదట ధరణి రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం మార్పులు చేసేందుకే సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ధరణి రద్దు చేస్తే ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. రైతుల భూ వివరాలకు సంబంధించి ధరణి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ధరణి కారణంగానే రైతు బంధు నిధుల విడుదల సులభతరంగా మారింది. ఒకవేళ ధరణి రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా నిధుల విడుదల కష్టతరం అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే రద్దు చేయకుండా పేరు మార్చి మార్పుల దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ సర్కార్ ధరణి విషయంలో ఏం చేయబోతుందో చూడాలి.

Also Read:సీతాఫలం తింటే ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -