బీజేపీ ” ఇంటింటి ప్రచారం ” ప్రజాగ్రహం తప్పదా ?

25
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలకు సరిగా ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విజయం కోసం ప్రధాన పార్టీలన్నీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల టైమ్ లో ఏ మాత్రం బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుందని కమలనాథులు భావిస్తున్నారు. దానికి నిదర్శనంగా హుజూరాబాద్, దుబ్బాక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల ఫలితాలను చూపిస్తున్నాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తే బీజేపీ నేతలు పప్పులో కాలేసినట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. .

ఎందుకంటే ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ స్థానాలలో సరైన అభ్యర్థులు లేరు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో బీజేపీపై ప్రజావ్యతిరేకత కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల సరఫరా సరిగా లేకపోవడం, బీజేపీ నేతల మతతత్వ రాజకీయం.. ఇలా చాలా కారణాలు ఆ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి సిద్దమౌతున్నారు. మహాజన్ సంపర్క్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Also Read: ” పవన్ వారాహి “.. వచ్చేస్తోందోచ్ !

అయితే బీజేపీ నేతలు చేపడుతున్న ఈ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలను కలవర పెడుతున్న అంశం. ఎందుకంటే ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటి ప్రచారం చేపట్టిన వైసీపీ సర్కార్ పై ప్రజల నుంచి గట్టిగానే వ్యతిరేకత పెల్లుబుక్కింది. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాలననే హైలెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్న కమలనాథులపై ప్రజాగ్రహం ఏర్పడే ఆవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం పై అసహనం గా ఉన్న ప్రజానీకం బీజేపీ నేతలను నిలదీసే ఛాన్స్ ఉంది. మరి బీజేపీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యూహా రచనతో ముందుకు సాగుతారో చూడాలి.

Also Read: తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్

- Advertisement -