దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న సంగతితెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కి చెందిన ఎంపీలు రెబల్‌గా మారారు. తాజాగా ఇప్పుడు నెక్ట్స్ టార్గెట్ అఖిలేష్ యాదవ్‌కి చెందిన సమాజ్‌వాది పార్టీ అని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్సే దీనికి ఉదాహరణ. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన మౌర్య….సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ భవిష్యత్తు పతన దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీల మద్దతు క్రమంగా తగ్గుతోందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తూ.. 2027లో సమాజ్‌వాదీ పార్టీకి కఠినమైన రాజకీయ పోరాటం ఎదురవుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఎలాగైతే బలహీనపడ్డాయో…. 2027లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. అఖిలేష్ యాదవ్ సైకిల్ ఇకపై అధికార కారిడార్లకు చేరుకోలేదు…అది కేవలం సైఫైకే పరిమితమవుతుంది అని మౌర్య వ్యాఖ్యానించారు.
Also Read:2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!
పార్టీలోని పలువురు నాయకులు, ఎంపీలు ప్రస్తుత నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత పరిస్థితి సాధారణంగా లేదు…. చాలా మంది నాయకులు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 25 నుండి 26 మంది ఎస్పీ ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ ఎలాంటి పార్టీ ఫిరాయింపుల రాజకీయాలకు పాల్పడటం లేదు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో ఎస్పీపై ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తారా అన్న కొశ్చన్ ఇప్పుడు అందరిలో నెలకొంది.

